వైసీపీ ఇంఛార్జీల మార్పు వ్యవహారం తుది దశకు చేరుకుంది. మరో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంఛార్జీలను మార్చేసి ఫైనల్ లిస్ట్ ను ప్రకటించేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తును వేగవంతం చేసింది. ఇప్పటికే 50 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. మొదటి జాబితాలో 11మంది అభ్యర్థుల పేర్లను, రెండో జాబితాలో 24 మంది అభ్యర్థుల పేర్లను, మూడో జాబితాలో 15మంది అభ్యర్థుల పేర్లను మార్పుతో ప్రకటించింది వైసీపీ అధిష్టానం. టికెట్ దక్కని నేతలు, స్థానం మారిన నేతలు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. తొలి మూడు జాబితాల్లో పేర్లు లేని నేతలు నాలుగో జాబితాలో అయినా తమ పేర్లు ఉంటాయని గంపెడాశలు పెట్టుకున్నారు.
ఇక సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది వైసీపీ అధిష్టానం. ఈ నెల 17న లేదా 18న నాలుగో జాబితాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. సర్వేల నివేదికల ద్వారా మరో 8 నియోజకవర్గాల్లో మార్పులు చేస్తూ నాలుగో జాబితాను రిలీజ్ చేయబోతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మార్కాపూరం(నాగార్జున రెడ్డి), గిద్దలూరు(అన్నా రాంబాబు), తిరువూరు(రక్షణ నిధి), గంగాధర నెల్లూరు(నారాయణ స్వామి), యలమంచిలి(కన్నా బాబు రాజు), సూళ్లూరుపేట(సంజీవయ్య), నందికొట్కూరు(తొగూరు ఆర్ధర్), సింగనమల(జొన్నలగడ్డ పద్మావతి) నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లను మార్చబోతున్నట్లుగా తెలుస్తోంది.
మార్కాపురంలో ఎమ్మెల్యే నాగార్జున రెడ్డికి కాకుండా జంకె వెంకట రెడ్డికి టికెట్ ఇవ్వాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. తిరువూరులో రక్షణ నిధిని కాదని టీడీపీ నుంచి చేరిన స్వామి దాస్ కు టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. యలమంచిలిలో కన్నబాబు రాజును తప్పించి గుడివాడ అమర్నాథ్ ను బరిలో దింపే ఛాన్స్ ఉంది. ఇదే చివరి జాబితా అని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. మిగిలిన వారంతా యధావిధిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.