TRINETHRAM NEWS

సి .ఆర్ మీడియా అకాడమీ చైర్మన్ పదవి కి కొమ్మినేని శ్రీనివాసరావు రాజీనామా

Trinethram News : విజయవాడ : సి .ఆర్ మీడియా అకాడమీ చైర్మన్ పదవికి వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా ఇవ్వనున్నట్లు కొమ్మినేని శ్రీనివాస రావు ప్రకటించారు. ఈ నెల 16 వరకు ప్రభుత్వ సెలవులు వున్న దృష్ట్యా 17 వ తేదీనుంచి తమ రాజీనామా అమలులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి తమపై నమ్మకంతో కేబినెట్ మంత్రి హోదా తో మీడియా అకాడమీ చైర్మన్ గా నియమించి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు ముఖ్య మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ శనివారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. 2022 నవంబర్ 10న తాను చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టి 13 నెలల 15 రోజులు కాలంలో పూర్తి గ తమ సామర్ధ్యాన్ని వినియోగించి వర్కింగ్ జర్నలిస్టుల కోసం పలు కార్యక్రమాలు చేయగలగడం తమకు సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు.

గ్రామీణ, పట్టణ జర్నలిస్టులు, జర్నలిజం పై అభిరుచి కలిగిన వ్యక్తుల కోసం మీడియా అకాడమీ ఆధ్వర్యంలో “జర్నలిజం లో డిప్లమో” కోర్సును నాగార్జున యూనివర్సిటీ సహకారంతో పూర్తి చేయడం తమకు అత్యంత సంతృప్తినిచ్చిన విషయంగా ఆయన పేర్కొన్నారు. డిప్లమో కోర్సు తో పాటుగా, ప్రతి శనివారం వర్కింగ్ జర్నలిస్టులకోసం సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక అంశాల పై ఆన్ లైన్ శిక్షణ తరగతులు నిర్వహించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు పత్రికా ముఖంగా ప్రజలకు వివరించగలిగామని ఆయన పేర్కొన్నారు. అనంతపురం నుంచి ఉద్దానం (శ్రీకాకుళం జిల్లా) వరకు జరిపిన పర్యటనల్లో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోజెక్టుల అభివృద్ధిని, ఉద్దానం కిడ్నీ వ్యాధుల పరిశోధనా కేంద్రం వంటి అభివృద్ధిని స్వయంగా పరిశీలించి ప్రజలకు మీడియా ద్వారా వివరించగలిగామని ఆయన తెలిపారు. ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియా తో పాటు సోషల్ మీడియాను కూడా సమాచార చేరవేతలో భాగస్వామిని చేయగలిగామన్నారు. తమ పదవీ కాలంలో సహకరించిన మీడియా మిత్రులందరికీ, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఆ ప్రకటనలో కొమ్మినేని శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.