రాజకీయ నాయకులకు తలొగ్గితే తప్పుకోవాల్సిందే – అధికారులకు సీఈసీ స్వీట్ వార్నింగ్!
ఎన్నికల విధుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే విధుల నుంచి తప్పుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లను హెచ్చరించింది.
రాజకీయపార్టీల ఒత్తిళ్లకు తలొగ్గుతూ నాయకులతో అనుబంధం కొనసాగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితాల అంశంపై సమీక్షించిన కేంద్ర ఎన్నికల బృందం అర్హుల ఓట్ల తొలగింపునకు ఫాం-7లు పెట్టినవారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని కలెక్టర్లను, ఎస్పీలను నిలదీసింది.
కొందరు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆయా పార్టీలు, నాయకులతో అనుబంధం కొనసాగిస్తున్నారనే ఫిర్యాదులున్నాయని అలాంటి వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. నిష్పక్షపాతంగా, తటస్థంగా ఉండలేమని ఎవరైనా భావించేవారు తప్పుకోవాలని చర్యలు తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని తేల్చి చెప్పింది. అర్హుల ఓట్ల తొలగింపునకు తప్పుడు సమాచారంతో వేలల్లో ఫాం-7 (Form-7)లు దరఖాస్తులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని నిలదీసింది. కొన్ని జిల్లాలు, నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులందుతున్నా ఎందుకు పరిష్కరించట్లేదని ప్రశ్నించింది.
తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు తనిఖీల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటాపై సీఈసీ బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకూ ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా ఎంత డబ్బు, మద్యం పట్టుకున్నారని ప్రశ్నించింది. ఆయన సమాధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏ మాత్రం సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతపురం సరిహద్దుల్లోకి కర్ణాటక నుంచి భారీగా మద్యం వస్తున్నా ఎందుకు పట్టుకోవట్లేదంటూ ఆ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌పై మండిపడింది. సరిహద్దుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎందుకు సరిగ్గా లేదని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డిని నిలదీసింది.