వంద కేజీల గంజాయి స్వాధీనం.. ఆరుగురు అరెస్ట్ : ఎస్పీ సుబ్బరాయుడు
Trinethram News : తిరుపతి : January 8, 2025
తిరుపతి ప్రతినిధి, (ఆంధ్రప్రభ): తిరుపతి జిల్లాలో పోలీసులు గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపారు. ఒకే రోజు 100 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని 10మంది స్మగర్లను అరెస్ట్ చేశారు. ఎస్పీ సుబ్బరాయుడు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారంతో తడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద సీఐ మురళీకృష్ణ, ఎస్ కొండప్ప నాయుడు, సిబ్బంది కాపుకాశారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఒక కారులో చెన్నైకి తరలించేందుకు సిద్ధంగా ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 28కిలోల గంజాయి, కారును తడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న వాటి విలువ సుమారు రూ.9.5లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. నిందితులు తమిళనాడులోని గుమ్మడిపూండికి చెందిన కె.షారుఖ్ ఖాన్ (24), జి.ఆరుళ్ (24)గా గుర్తించారు. షారుఖ్ ఖాన్‌పై ఇప్పటికే హత్య కేసు, నార్కోటిక్ డ్రగ్స్ కేసు, పలు గొడవల కేసుల్లో ముద్దాయిగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు. విచారణలో పసుపులేటి గిరిబాబు, మోహన్ మదన్ కుమార్, పంజనాథన్ అజయ్, మునుసుందరం కీరుబాకరణ్ నుంచి నిందితులు గంజాయి కొనుగోలు చేసి తమిళనాడు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో…
మండల పరిధిలోని కోట క్రాస్, కడివేడు గ్రామం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో రెండు కార్లను అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు తనిఖీలు చేశారు. సుమారు రూ.16లక్షల విలువ చేసే 72కేజీల గంజాయి గుర్తించి కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందిలను అరెస్ట్ చేశారు. విచారణలో కాకినాడ జిల్లా తుని ప్రాంతానికి వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, చెన్నై సమీపంలోని గుమ్ముడిపూండి, పుత్తూరు పరిసర ప్రాంతాలలో విక్రయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుల్లో ముగ్గురు తమిళనాడు వాసులు కాగా ఒకరు పుత్తూరుకు చెందిన వారు ఉన్నారు.
నిందితులు తమిళనాడుకు చెందిన మోహన్ మదన్ కుమార్ (30), పంజనాథన్ అజయ్ (24), మునిసుందరం కీరుబాకరన్ (18), పుత్తూరుకు చెందిన పసుపులేటి గిరిబాబు (41)గా గుర్తించారు. గిరిబాబు గతంలో హోమ్ గార్డుగా పనిచేసినట్లు పోలీసుల నిర్ధారించారు.
కఠిన చర్యలు తప్పవు…
ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ… గంజాయి అక్రమ రవాణా, సంబంధిత నేరాలపై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని ఈ తరహా చర్యలు నిరంతరం కొనసాగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి రవాణా, విక్రయాలపై సమాచారం తెలిసిస్తే హెల్ప్‌లైన్ నెంబర్ 80999 99977, లేదా డయల్ 100 లేదా డ్రగ్స్ టోల్ ఫ్రీ నెంబర్ 14446 కు సమాచారం ఇవ్వాలని కోరారు. సురక్షితమైన, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకుందామని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనుబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవిమనోహరాచారి, డీఎస్పీలు రమణ కుమార్, చెంచు బాబు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App