TRINETHRAM NEWS

అందరూ ఏడాదిలోపు చిన్నారులే – మహారాష్ట్రలో 3 – భారత్ లో 9కి చేరిన హెచ్‌ఎంపీవీ కేసులు

Mumbai : ముంబైలో ఆరు నెలల శిశువులో హెచ్ఎంపీవీ వైరస్ మొదటి కేసు నమోదైంది. దీంతో మహారాష్ట్రలో మొత్తం హెచ్‌ఎంపీవీ కేసుల సంఖ్య 3కి చేరింది.

ఓ పక్క హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (Human Metapneumovirus)తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నప్పటికీ.. మరో పక్క కేసులు పెరుగుతుండడం కలకలం సృష్టిస్తోంది. తాజాగా ముంబైలో మొదటి కేసు నమోదైంది. దీంతో మహారాష్ట్రలో హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య 3కి చేరుకోగా.. దేశంలో 9కి చేరింది. దగ్గుతో పాటు 84శాతం ఆక్సిజన్ లెవల్స్ పడిపోయిన ఓ 6 నెలల చిన్నారిని ఆస్పత్రిలో చేర్చారు. చికిత్సలో భాగంగా చిన్నారికి ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా హెచ్ఎంపీవీ(HMPV) పాజిటివ్ గా నిర్థారణ అయినట్టు వైద్యులు తెలిపారు. ఈ వైరస్ కు ఇప్పటివరకూ ఎలాంటి వ్యాక్సిన్ గానీ, సరైన చికిత్స లేదు. కావున చిన్నారిని ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నామన్నారు. ఐదు రోజుల తర్వాత ఈ చిన్నారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని చెబుతున్నారు. మరోపక్క ఈ కేసుకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ చెబుతోంది. ఇన్ఫ్లుఎంజా, తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల కోసం నిఘా పెంచినట్లు తెలిపింది.

అంతకుముందు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రెండు హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, చికిత్స తర్వాత ఇంటికి పంపించారని అధికారులు తెలిపారు. వారి నమూనాలను సేకరించి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి పంపినట్టు సమాచారం. ఇక ఇప్పటివరకు, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లోనూ ఈ వైరస్ కు సంబంధించిన కేసులు నమోదు కావడం అంతటా భయాందోళనలను సృష్టిస్తోంది.

వైరస్ బారిన పడుతోన్న చిన్నారులు

ఇటీవలి కాలంలో భారత్ లో నమోదైన కేసులను బట్టి చూస్తే.. వారంతా ఏడాదిలోపున్న చిన్నారులే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో పిల్లలతో పాటు వృద్ధులు కూడా జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించడం, పరిశుభ్రత పాటించడం వంటి నివారణలు చాలా అత్యవసరమని చెబుతున్నారు. నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తతతో వ్యవహరించాలని అంటున్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ అంత తీవ్రత ఉండకోవచ్చన్నది అధికారులు చెప్తున్న మాట. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాలు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశాయి.

  • జన ప్రవాహం ఉన్న ప్రదేశాల్లో తిరగరాదు. ఒక వేళ అత్యవసరం అయితే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.
  • తరచుగా చేతులను సబ్బు లేదా శానిటైజర్ తో కడుక్కోవాలి.
  • ముక్కు, నోరు, కళ్లను తరచూ తాకకూడదు.
  • బహిరంగ స్థలాల్లో ఉమ్మివేయరాదు.
  • జబ్బు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. తీవ్రమైన పక్షంలో వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.
  • శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్స్ ఉన్న వారు వాడిన వస్తువులను వేరుగా ఉంచాలి.
  • పోషకాహారాన్ని తీసుకోవాలి. బయటి ఫుడ్ కు దూరంగా ఉండాలి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App