TRINETHRAM NEWS

భారీ భూకంపానికి టిబెట్ దేశంలో 53 మంది మృతి

Trinethram News : టిబెట్ : మంగళవారం ఉదయం నేపాల్-టిబెట్(Tibet) దేశాల సరిహద్దులను భారీ భూకంపం వణికించింది. హిమాలయ దేశాల్లో 7.1 తీవ్రతో భూకంపం సంభవించింది. ఈ ప్రకృత్తి విపత్తు కారణంగా ఇప్పటివరకు టిబెట్‌లో 53 మంది మరణించినట్టు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. 63 మంది గాయాలపాలైనట్టు తెలిపింది. మృతుల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య ఇంకా పెరగవచ్చని అంచనా వేసింది. నేపాల్-టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచె ప్రాంతంలో మంగళవారం ఉదయం 6:35 గంటలకు ఈ భారీ భూకంపం సంభవించింది.

టిబెట్‌లోని షిజాంగ్ ప్రాంతంలో పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప కేంద్రమైన టిబెట్‌లో భూకంపం ధాటికి పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి.భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భారీ భూకంపం తర్వాత టిబెట్‌లో మరో రెండు సార్లు ప్రకంపనలు వచ్చాయి. వాటి తీవ్రత 4.7, 4.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం టిబెట్‌లో సహాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శిథిలాల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయారు. వారిని వెలికితీసేందుకు యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది.

ఈభూకంపం ప్రభావం భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా పడింది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో కూడా స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. బీహార్‌లోని కొన్ని ప్రాంతాల ప్రజలు ప్రకంపనల కారణంగా ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. అయితే ఎక్కడా నష్టం వాటిల్లలేదు. హిమాలయ ప్రాంతాలైన నేపాల్, టిబెట్‌లలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. 2015లో నేపాల్‌లో 7.8 తీవ్రతో సంభవించిన భారీ భూకంపం కారణంగా ఏకంగా 9 వేల మంది మరణించారు. 22 వేల మందికి పైగా గాయపడ్డారు. ఐదు లక్షల ఇళ్లకు పైగా నేలమట్టమయ్యాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App