విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
ఈ నెల 20 నుంచి 24 వరకూ దావోస్‌లో ప్రపంచ ఆర్దిక వేదిక 55వ వార్షిక సదస్సు
జనవరి 21 నుంచి మూడు రోజుల పాటు దావోస్ సదస్సులో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
15 నుంచి 19 వరకూ ఆస్ట్రేలియాలో సీఎం బృందం పర్యటన
19,20 తేదీల్లో సింగపూర్‌లో పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ
Trinethram News : తెలంగాణ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 15 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్‌లో రేవంత్ బృందం పర్యటించనుంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా ఈ నెల 20 నుంచి 24 వరకు 5 రోజుల పాటు ప్రపంచ ఆర్దిక వేదిక 55వ వార్షిక సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో జనవరి 21 నుంచి 23 వరకూ సీఎం రేవంత్‌తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజన్, ఇతర ఉన్నతాధికారులు ఆ సదస్సులో పాల్గొననున్నారు.
2024లో దావోస్ పర్యటన సందర్భంగా సుమారు రూ.40వేల కోట్లకుపైగానే పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు కంపెనీలతో చేసుకుంది. అవి కార్యరూపం దాల్చి వేర్వేరు దశల్లో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపారు. ప్రస్తుత దావోస్ పర్యటనలోనూ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం బృందం ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు ముందు ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13నే పర్యటనకు ఏర్పాట్లు చేయాలని భావించినా, సంక్రాంతి పండుగ తర్వాత 15న బయలుదేరే ఆలోచన చేస్తున్నారని సమాచారం. సీఎం రేవంత్ ఆస్ట్రేలియా పర్యటనలో ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ సోనీ బాల, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలో క్వీన్స్‌లాండ్ క్రీడా విశ్వవిద్యాలయాన్ని వీరు పరిశీలిస్తారు.
ఆస్ట్రేలియాలో మూడు నాలుగు రోజుల పాటు పర్యటించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బృందం జనవరి 19న సింగపూర్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ రెండు రోజుల పాటు షాపింగ్ మాల్స్‌పై క్రీడా ప్రాంగణాల నిర్మాణాలను పరిశీలిస్తారు. సింగపూర్‌లో పారిశ్రామిక వేత్తల సమావేశంలోనూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొంటారు. అనంతరం దావోస్‌కు చేరుకుని ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో పాల్గొననున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App