TRINETHRAM NEWS

శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

Trinethram News : న్యూఢిల్లీ : భారత దేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం కేంద్రం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని గురువారం రాత్రి ఆయన అధికారిక నివాసం మోతిలాల్ నెహ్రు మార్గ్ 3 కి తరలించారు. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్, కేంద్ర మంత్రులు మన్మోహన్ సింగ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

కాగా శుక్రవారం ఉదయం 11గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం అవుతుంది. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ మృతికి కేబినెట్ సంతాపం తెలపనుంది. ఇప్పటికే 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటన చేయడంతో ఈరోజు అధికారిక కార్యక్రమాలను రద్దు చేసింది. అలాగే కాంగ్రెస్ కూడా 7 రోజుల పాటు పార్టీ కార్యక్రమాలను రద్దు చేసింది. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఈరోజు సెలవుదినంగా ప్రకటించింది.

కాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ (92) కన్నుమూశారు. ఆయన మరణాన్ని ఎయిమ్స్‌ వైద్యులు దృవీకరించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ట్వీట్ చేశారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందించారు. అయితే కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం రాత్రి 9గంటల 51 నిమిషాలకు మరణించినట్లు ఎయిమ్స్ మీడియా సెల్ ప్రొఫెసర్ ఇన్‌చార్జ్ డాక్టర్ రిమా దాదా ఒక ప్రకటనలో చెప్పారు.

దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్‌ సింగ్‌.. అక్టోబర్‌ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు.1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన.. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ పని కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రారంభించారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, సమాచార హక్కు చట్టం వంటి కీలక సంస్కరణలకు పునాది వేశారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App