ఇదెక్కడి రాజకీయం?.. కౌశిక్ రెడ్డి కేసు వ్యవహారంపై కేటీఆర్, హరీశ్ రావు ఘాటు స్పందన
ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి ఏసీపీ, సీఐ పారిపోతున్నారన్న కేటీఆర్
ప్రతిపక్ష ఎమ్మెల్యేను కలిసేందుకు కూడా భయమా అని ప్రశ్నించిన మాజీ మంత్రి
ఇలాంటి కేసులకు అదిరేది లేదు, బెదిరేది లేదన్న హరీశ్ రావు
ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామంటూ హెచ్చరిక
Trinethram News : Telangana : డ్యూటీలో ఉన్న సీఐ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బెదిరింపులకు దిగారనే కారణాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బంజారహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదయిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రులు, బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్ రావు ఖండించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారని తెలిసి ఏసీపీ పరార్ అవుతారని, సీఐ పారిపోతారని కేటీఆర్ ఆరోపించారు. ‘‘ఎంత అధికార పార్టీకి ఊడిగం చేస్తే మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేను అధికారికంగా మీ ఆఫీసులో కలిసేందుకు కూడా భయమా?. పట్టుకొని నిలదీస్తే… అక్రమ కేసులా? ఇదెక్కడి రాజకీయం? ఇదేనా ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం? ’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. అక్రమాలను ప్రశ్నిస్తే తమ ఎమ్మెల్యేలపై కేసులు పెడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రజా గొంతుకులైన తమకు కేసులేమీ అడ్డం కాబోవని, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటామని, పోరాడుతూనే ఉంటామని కేటీఆర్ పేర్కొన్నారు.
అదిరేది లేదు, బెదిరేది లేదు: హరీశ్ రావు
ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు వెనుకాడుతారని, పైగా ఉల్టా కేసు బనాయిస్తారా అని మాజీ మంత్రి హరీశ్ ప్రశ్నించారు. ‘‘ఇదేం విడ్డూరం. ఇదెక్కడి న్యాయం?. ఇదేం ప్రజాస్వామ్యం?. రేవంత్ మీ పాలన మార్పు మార్కు ఇదేనా? రాజ్యాంగాన్ని కాపాడుదామంటూ రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకొని తిరుగుతారు. నువ్వేమో (రేవంత్ రెడ్డి) తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూనే ఉంటావు. ప్రజల తరపున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడతామంటే అదిరేది లేదు, బెదిరేది లేదు. ప్రజాక్షేత్రంలో నిన్ను నిలదీస్తూనే ఉంటాం. నీ వెంట పడుతూనే ఉంటాం’’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని హరీశ్ రావు అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App