TRINETHRAM NEWS

AP Anganwadi Workers: ‘తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తామని.. ఇప్పుడు మాట మార్చారు’

ఏపీ వ్యాప్తంగా అంగన్‌వాడీల ఆందోళన..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా అంగన్‌వాడీలు (Anganwadi workers) ఆందోళనకు దిగారు. ప్రభుత్వంతో రెండు రోజులుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో మంగళవారం నుంచి నిరవధికంగా సమ్మె చేస్తున్నారు..

దీంతో రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. అంగన్‌వాడీలకు మద్దతుగా సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూలు కలిసి ఉమ్మడిగా సమ్మెలో పాల్గొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సీడీపీవో కార్యాలయాలు, మండల కేంద్రాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు నిరాహారదీక్షలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు..

”కనీస వేతనం ₹26వేలు ఇవ్వాలి. గ్రాట్యుటీతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలి. పనిభారం పెంచారు.. జీతాలు మాత్రం పెంచట్లేదు. నాసిరకం ఫోన్లు ఇచ్చి యాప్‌లలో విధులకు సంబంధించిన వివరాలు అప్‌డేట్‌ చేయమంటే ఎలా చేయాలి? జగనన్న (YS Jagan) ఇచ్చిన యాప్‌ మాత్రమే ఆ ఫోన్లలో ఉంటుంది. తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తామన్నారు.. ఇప్పుడేమో మాట మార్చారు” అని రాష్ట్ర ప్రభుత్వంపై (YSRCP) అంగన్‌వాడీలు మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. దాదాపుగా లక్ష మంది వరకు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఉన్నారు. వీరంతా సమ్మె బాట పట్టారు.