Trinethram News : తెలుగుదేశం పార్టీ వశమైన కమలాపురం పురపాలక సంఘం!
అధికారిక ప్రకటనే తరువాయి
టీడీపీలో చేరిన పురపాలక ఛైర్మన్ మర్పూరి మేరీ, కౌన్సిలర్లు షేక్‌నూరి, రాజేశ్వరి, సలీల, నాగమణి
జగన్ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డికి ఝలక్ ఇచ్చిన అధికార పార్టీ
వైఎస్సార్ కడప జిల్లాలోని కమలాపురం పురపాలక సంఘం రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. ఈ పురపాలక సంఘాన్ని చేజిక్కించుకోవడంపై టీడీపీ కన్నేసింది. ఈ మేరకు వ్యూహాత్మకంగా పావులు కదపడంతో పురపాలక ఛైర్మన్ మర్పూరి మేరీ, కౌన్సిలర్లు షేక్‌నూరి, రాజేశ్వరి, సలీల, నాగమణి సోమవారం టీడీపీలో చేరారు.
ఇదివరకే కొందరు కౌన్సిలర్లు చేరగా తాజాగా చేరిన వారితో కలుపుకొని టీడీపీ సంఖ్యా బలం 10కి పెరిగింది. ఫలితంగా వైసీపీ సంఖ్యా బలం 8కి తగ్గింది. దీంతో కమలాపురం పురపాలక పీఠం దాదాపు అధికార పార్టీ వశమైనట్టే. త్వరలో జరిగే పురపాలక సర్వసభ్య సమావేశంలో ఛైర్మన్‌ను ఎన్నుకునే అవకాశాలున్నాయి. ఈ మేరకు టీడీపీ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ పరిణామంతో కమలాపురం వైసీపీ శాసనసభ్యుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి భారీ షాక్ తగిలినట్టు అయింది. వైసీపీ చేతిలోంచి ఈ పురపాలక సంఘం టీడీపీ ఖాతాలో పడబోతోంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చాయని, అందుకే పార్టీ మారుతున్నట్టు పురపాలక సంఘం చైర్మన్ మర్పూరి మేరీతో పాటు కౌన్సిలర్లు చెప్పారు. ఇక టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి నాయకత్వంపై నమ్మకం ఉండడంతో పార్టీ మారామని పేర్కొన్నారు. మరోవైపు ఇంకొందరు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App