TRINETHRAM NEWS

Panchayat elections in 3 phases

రిజర్వేషన్ల ఖరారు తర్వాతే నోటిఫికేషన్‌కఠినంగా నియమావళి అమలు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న పార్థసారథి

Trinethram News : హైదరాబాద్‌: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్‌ బాక్స్‌లతో మూడు దశల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) సి.పార్థసారథి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేశాక నోటిఫికేషన్‌ వెలువడుతుందన్నారు. శాసనసభ ఎన్నికల జాబితాల ఆధారంగా వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. పంచాయతీ ఎన్నికలకు ప్రవర్తనా నియమావళి (కోడ్‌) కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఖాళీగా ఉన్న డీపీవో, ఎంపీడీవో, ఎంపీవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై గురువారం ఎస్‌ఈసీ తమ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్‌ కుమార్, కమిషనర్‌ అనితా రామచంద్రన్, 32 జిల్లాల అదనపు కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, డివిజనల్‌ అధికారులు, నియోజకవర్గాల నమోదు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడారు. ఓటర్ల ముసాయిదా జాబితాలను వచ్చే నెల 6న గ్రామ పంచాయతీల్లో ప్రచురించాలని.. అనంతరం మండల, జిల్లా స్థాయుల్లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం ఏర్పాటుచేసి వారి సూచనలు, సలహాలు స్వీకరించాలని కలెక్టర్లకు తెలిపారు. ముసాయిదా జాబితాల్లో తప్పులుంటే వచ్చే నెల 13న గ్రామ పంచాయతీ అధికారులు ప్రజల నుంచి రాతపూర్వకంగా తీసుకోవాలన్నారు. సవరణల అనంతరం వచ్చే నెల 21న తుది జాబితాను ప్రచురించాలని తెలిపారు. ఆ తర్వాత ఏవైనా మార్పులు, చేర్పులు అవసరమైతే ప్రజలు శాసనసభ నియోజకవర్గ ఓటర్ల రిజిస్ట్రేషన్‌ అధికారికి దరఖాస్తు చేసుకుంటే.. మార్పులు, చేర్పులతో అనుబంధ జాబితాలను విడుదల చేస్తారని.. వాటికి అనుగుణంగా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలోనూ మార్పులు, చేర్పులు చేయనున్నట్లు వివరించారు. ఓటర్ల జాబితాల తయారీ, వార్డులవారీగా పోలింగ్‌స్టేషన్ల ఏర్పాటు, సిబ్బంది వివరాల సేకరణ; రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్‌ అధికారుల నియామకం, శిక్షణ వంటివి చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 12,991 గ్రామ పంచాయతీలున్నందున ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని.. ఏపీ, కర్ణాటకల నుంచి బ్యాలెట్‌ బాక్స్‌లు తేవాలని, వీటికోసం మూడు దశల్లో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ రూపొందించిన గ్రీవెన్స్‌ మాడ్యూల్‌ను పార్థసారథి విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగితే మాడ్యూల్‌ ద్వారా పౌరులు ఫిర్యాదు చేయాలని.. వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని.. ఆయా ఫిర్యాదులపై కలెక్టర్లు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని పార్థసారథి తెలిపారు.

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉంటాయని.. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని పార్థసారథి తెలిపారు. ”పార్టీ రహితంగా జరిగే ఎన్నికలైనా రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటివాటిని అడ్డుకోవాలి. ఖమ్మం, వరంగల్‌లలో డీపీవో; నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఎనిమిదేసి ఎంపీడీవో; మంచిర్యాల, నారాయణపేటల్లో నాలుగేసి ఎంపీడీవో, మరో నాలుగేసి ఎంపీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని వెంటనే భర్తీ చేయాలి” అని పార్థసారథి అధికారులకు సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Panchayat elections in 3 phases