Trinethram News : కేంద్రంలో మోడీ మూడోసారి పీఠం మీద కుదురుకున్న కొద్దిరోజులకే ప్రయివేటు టెలికం కంపెనీలు మొబైల్ రీఛార్జి ధరలను భారీగా పెంచి, ప్రజలపై రూ.20 వేల కోట్ల భారాన్ని మోపాయి.ఈ భారాల మోతకు తొలుత జియో ఉపక్రమించగా, ఎయిర్‌టెల్, వోడా దానిని అనుసరించాయి.
నిర్వహణ వ్యయానికి తగ్గట్టుగా ధరలను పెంచటం అనివార్యమైందని అవి బయటికి ప్రకటించినా – జనం మొబైల్ అవసరాన్ని లాభాల మూటలుగా మార్చుకోవటమే వాటి అసలు ఉద్దేశం.
2023-24 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ జియో రూ.20,607 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా, ఎయిర్‌టెల్ రూ.7,467 కోట్ల లాభాన్ని వెనకేసుకొంది. అయినా, ఈ కంపెనీల ధనదాహం తీరలేదు.
దేశంలో మొబైల్ ఫోన్లను వాడుతున్న కోట్లమంది నుంచి తలో కొంత అదనంగా పిండుకున్నా – వేల కోట్లను సులభంగానే గడించవచ్చునని గట్టిగా నిర్ణయించుకున్నాయి.
బయటికి పరస్పరం పోటీదారులమన్నట్టు పోజులిస్తూ- ఛార్జీల వడ్డనలో మాత్రం కూడబలుక్కునే వ్యవహరించాయి. ఒకే తరహాలో టారిఫులను పెంచి, వినియోగదారుల నెత్తిన భారాలు మోపాయి.
రిలయన్స్ జియో తన టారిఫ్‌ను 12 – 25 శాతం మధ్య పెంచగా, ఎయిర్‌టెల్ 11 – 21 శాతం మేర హెచ్చించింది. ఎక్కువమంది అనివార్యంగా వాడే ప్లాన్ల మీద తెలివిగా భారాలను వడ్డించాయి. కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత వైఖరి, కార్పొరేట్లకు దోచిపెట్టే ధోరణీ ఈ ప్రొవైడర్ల దోపిడీకి మార్గం సుగమం చేస్తున్నాయి.
ప్రయివేటు టెలికం కంపెనీలు రంగంలోకి రాకముందే దేశంలో మూలమూలకీ విస్తరించిన ప్రతిష్టాత్మక ప్రభుత్వరంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్). బిజెపి ప్రభుత్వం దాని కాళ్లకు బంధనాలు వేసి, కుట్రపూరితంగా కూలదోసి, కార్పొరేటు కంపెనీలకు రకరకాల రాయితీలతో, అవకాశాలతో విస్తరించే భూమికను ఏర్పరిచింది.
బిఎస్‌ఎన్‌ఎల్ తన సేవలను విస్తరించటానికి, సాంకేతిక శక్తిసామర్థ్యాలను పెంచుకోవటానికి ప్రయత్నించిన ప్రతిసారీ అడ్డంకులు కల్పించింది. బిఎస్‌ఎన్‌ఎల్ అనేది ఒక అసమర్థ సంస్థగా చిత్రీకరించే పనిని బిజెపి నాయకులే స్వయంగా చేపట్టి, ప్రచారం చేశారు. ఊరూరా నెట్‌వర్కు ఉన్న సంస్థను, సాంకేతిక నిపుణులు ఉన్న సంస్థను అడుగడుగునా అవహేళన చేశారు.
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 3జి, 4జి, 5జి సేవల్లోకి వెళతామన్న ప్రతిసారీ అనుమతి నిరాకరించారు. 2016లో మోడీ నోట్ల రద్దు ప్రకటించి, డిజిటల్ చెల్లింపుల ప్రస్తావనను చర్చలోకి తెచ్చిన కొద్దిరోజులకే అంబానీ గారి జియో వ్యూహాత్మకంగా రంగప్రవేశం చేసింది.
ఆకర్షణీయమైన తక్కువ టారిఫ్ ప్రకటించి,కొద్దిరోజు ల్లోనే లక్షలాది మంది వినియోగదారులను గుప్పిట పట్టింది. జియో విస్తరణకు ఇంతగా సేవలందిస్తున్న మోడీ ప్రభుత్వం… బిఎస్‌ఎన్‌ఎల్ సొంతంగా తన కాళ్ల మీద తాను నిలబడు తుంటే – కర్కశంగా కత్తి ఝళిపిస్తోంది. బిఎస్‌ఎన్‌ఎల్ హైస్పీడు డేటాను తన వినియోగదారులకు అందివ్వాలని ప్రణాళికలు వేసుకుంటే- అందుకు అనేక విధాలుగా మోకాలడ్డింది.
ప్రయివేటు ప్రొవైడర్లు రెండు,మూడు దశలు ముందుకెళ్లిన తరువాతనే ఈ సంస్థకు మొదటి దశ సేవలకు అంగీకారం తెలిపే వైఖరిని అవలంబిస్తోంది. నాణ్యమైన సంస్థల నుంచి 4జి, 5జి నిర్వహణా పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం కొనుగోలు చేస్తామని బిఎస్‌ఎన్‌ఎల్ అభ్యర్థిస్తే – ఏళ్ల తరబడి కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ నుంచి అతీగతీ లేదు.
ఈ ద్రోహపూరిత నిర్లక్ష్యం కారణంగా 2023-24లోనే, బిఎస్‌ఎన్‌ఎల్ 1.8 కోట్ల మంది వినియోగదారులను కోల్పోయింది. ఒక్క గత మార్చిలోనే 23.54 లక్షల మంది వైదొలిగారు. అదే నెలలో జియో 21.43 లక్షల మందిని, ఎయిర్‌టెల్ 17.5 లక్షల మందిని కొత్త కస్టమర్లుగా పొందాయి.
బిఎస్‌ఎన్‌ఎల్ బలంగా ఉన్నప్పుడు నిజమైన రెగ్యులేటర్‌గా వ్యవహరించి, ప్రయివేటు ప్రొవైడర్ల ధరలు అదుపులో ఉండటానికి కారణమైంది.క్రమేణా విస్తరణ కుంటుపడి, ప్రయివేటు కంపెనీల విజృంభణకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.
ప్రజలకు ఈ భారాల మోత లేకుండా ఉండాలీ అంటే బిఎస్‌ఎన్‌ఎల్ 5జి సేవలతో బలంగా విస్తరించాలి. అందుకు కేంద్ర ప్రభుత్వం తగిన అనుమతులూ, సహాయ సహకారాలూ అందించాలి. ప్రయివేటు టెలికం కంపెనీల ధరల దూకుడుకు కళ్లెం వేయటం బిఎస్‌ఎన్‌ఎల్ బలోపేతం కావటం ద్వారానే సాధ్యం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App