The District Collector conducted surprise inspection of Primary School and Zilla Parishad High Schools
పాలకుర్తి , జూన్ -21: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష పాలకుర్తి మండలం బసంత్ నగర్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్ 4వ, 5వ తరగతి విద్యార్థులను లెక్కలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు వేయగా, పిల్లలు సరైన సమాధానాలు చెప్పడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య, విద్యార్థుల సంఖ్య వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పదోన్నతుల కారణంగా పాఠశాలలో ఖాళీ అయిన రెండు ఎస్.జి.టీ టీచర్లు బదిలీలో భర్తీ అవుతారని ప్రధానోపాధ్యాయులు కలెక్టర్ కు వివరించారు. ప్రతి ఉపాధ్యాయునికి టైం టేబుల్ అందించి పిల్లలకు తరగతులు ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 125 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలుసుకున్న కలెక్టర్, విద్యార్థుల సంఖ్య 150 పెరిగేలా చూడాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు.
పాలకుర్తి మండలంలో పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మొదటి స్థానంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిలిచిందని, దీనికి సంబంధించి రూపొందించిన కరపత్రాన్ని కలెక్టర్ పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలోని పదవ తరగతి విద్యార్థులపై సైతం ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించడంతో పాటు 9 జీపీఏ కంటే ఎక్కువ గ్రేడ్ వచ్చే విధంగా కృషి చేయాలని, మన పాఠశాలల నుంచి కనీసం ముగ్గురు విద్యార్థులకు ఐఐఐటి సీటు లభించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
పాఠశాలలో జరుగుతున్న హెల్త్ చెకప్ ను తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికంగా విద్యార్థులకు డెంటల్ సమస్యలు ఉన్నాయని తెలుసుకున్న కలెక్టర్ వారికి అవసరమైన వైద్య సహాయం సత్వరమే అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పాఠశాలలో ఉన్న వంట గదిని కలెక్టర్ పరిశీలించి పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలో ఉన్న బోర్ సమస్య పరిష్కారానికి ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ తో కలిసి ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయు రాలు బి.గాయత్రీ దేవి, టీచర్స్, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App