Trinethram News : ఆమరావతి : సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయాలను నాయకులు అర్థం చేసుకొని కలిసి పనిచేయాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు..
పార్టీ నేతలు, వివిధ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలతో అధినేత వరుసగా చర్చిస్తున్నారు. 12 నియోజకవర్గాల నేతలతో స్వయంగా మాట్లాడి ఎన్నికలకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు.
యర్రగొండపాలెంలో పార్టీ నేతలు మన్నె రవీంద్ర, ఎరిక్సన్ బాబు ఇద్దరూ కలిసి పనిచేయాలని సూచించారు. పార్వతీపురం నియోజకవర్గ నేతలు విజయ్, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్‌లతో చర్చించారు. విజయ్‌ను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. నంద్యాలలో ఫరూక్‌కు సహకరించాలని బ్రహ్మానందరెడ్డికి సూచించారు. కల్యాణదుర్గంలో సీటు దక్కించుకున్న సురేంద్రబాబుకు పూర్తి సహకారం అందించాలని ఉమామహేశ్వరనాయుడు, హనుమంతరాయ చౌదరిలను ఆదేశించారు..
కురుపాం నేత దత్తి లక్ష్మణరావుతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు.. పార్టీ అభ్యర్థి టీ జగదీశ్వరి గెలుపునకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా లక్ష్మణరావును నియమించారు. పార్టీ కోసం పనిచేయాలని చిత్తూరు జిల్లా నేత, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్‌కు సూచించారు. ఉంగుటూరు ఇన్‌ఛార్జి గన్ని వీరాంజనేయులు, పిఠాపురం వర్మ, పోలవరం బొరగం శ్రీనివాస్, నర్సాపురం పొత్తూరి రామరాజు, కాకినాడ రూరల్‌లో పిల్లి సత్యనారాయణమూర్తి, తాడేపల్లిగూడెం వలవల బాబ్జీలతో మాట్లాడారు. పొత్తులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి సీటు వచ్చినా గెలిపించేందుకు పనిచేయాలని నేతలకు వివరించారు. సీటు దక్కని ప్రతి ఒక్కరికీ పార్టీ న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. స్వయంగా చంద్రబాబు మాట్లాడటంతో పార్టీ కోసం పనిచేస్తామని నేతలు స్పష్టం చేశారు..