వాషింగ్టన్ :
పండ్లు తింటే రోగాలు నయమవుతాయని, దూరమవుతాయని విన్నాం. అంతేకాదు.. పండ్ల వాసన క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకోగలదని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది.
క్యాన్సర్ థెరపీలో వైద్యులు ‘హిస్టోన్ డిఎసిటలేస్ ఇన్హిబేటర్’ (హెచ్‌డీఏసీ)ను వాడుతారు. క్యాన్సర్ కణాల వృద్ధి, న్యూరోడిజెనరేటివ్ (పార్కిన్సన్, అల్జీమర్స్.. మొదలైనవి) వ్యాధులను అడ్డుకోవటంలో ఇది ఉపయోగపడుతుంది.
అయితే బాగా పండిన పండ్ల నుంచి వెలువడే వాసన కూడా హెచ్‌డీఏసీ మాదిరి ప్రభావం చూపుతున్నదని సైంటిస్టుల ప్రయోగాల్లో తేలింది. పండ్ల వాసన పీల్చినప్పుడు జన్యు వ్యక్తీకరణలో మార్పులు ఉన్నాయని, ఇది క్యాన్సర్, నరాల సంబంధిత వైద్య చికిత్సలో సహాయకారిగా మారుతున్నదని సైంటిస్టులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని ప్రయోగాలు జరపాల్సి ఉందని, ఆవిర్లు, వాసనలకు గురిచేయటం వంటి కొత్త విధానాలు క్యాన్సర్ కణాలపై ఏమేరకు ప్రభావం చూపుతాయన్నది తేలాల్సి ఉందని వారు చెబుతున్నారు. ఈనేపథ్యంలో ఎలుకలు, జంతువులపై ప్రయోగాలు చేస్తున్నట్టు తెలిపారు. మనుషుల్లోని వివిధ అవయవాలకు సోకే క్యాన్సర్‌కు సంబంధించి వైద్య చికిత్సలో ఇది కీలకం అవుతుందని అంటున్నారు.