TRINETHRAM NEWS

Trinethram News : February 29, 2024

వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో కలప అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. టన్నుల కొద్దీ కలప ఇటుక బట్టీలకు తరలుతోంది. అక్రమార్కులు వాల్టా చట్టానికి తూట్లు పొడిచి రోడ్ల వెంబడి, గుట్టలలో ఏపుగా పెరిగిన చెట్లను నరికి వేయించి సొమ్ము చేసుకుంటున్నారు.

రాత్రి, పగలు తేడా లేకుండా చెట్లను నరికి ఏ మాత్రం భయం లేకుండా ట్రాక్టర్లు, బొలెరో వాహనాలు, లారీల్లో తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడిచి కలపను తరలిస్తున్నారంటే అధికారులు ఏ మేరకు వ్యాపారులతో లాలూచి పడ్డారో అర్థం చేసుకోవచ్చునని అన్నారు.

ప్రతిరోజూ రోడ్డు మార్గాల్లో కలప తరలుతోంది. అధికారుల చేయి తడిపితే ఎటువంటి ఇబ్బంది ఉండదని, లేని పక్షంలో వేలకు వేలు అపరాధ రుసుం వేసి చేస్తున్నారని అంటున్నారు. విపరీతంగా చెట్లు నరికివేయడంతో వాతావరణ సమతుల్యం దెబ్బతిని వర్షాలు కురవక కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదముంటుందని ప్రకృతి ప్రేమికులు వాపోతున్నారు. అడవులు కనుమరుగు అవడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు చెట్ల నరికివేతను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపడుతుంటే మరోవైపు అక్రమార్కులు యథేచ్ఛగా చెట్లను నరుకుతూ కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారు.

మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలనే నినాదం అధికారుల అలసత్వంతో కాగితాలకే పరిమితమైంది. అడవులను రక్షించడంతో పాటు వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం వాల్టా చట్టం రూపొందించింది. చెట్లను నరికి వేయాలంటే అటవీశాఖ,రెవెన్యూ శాఖ సంబంధిత గ్రామ పంచాయతీ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు. దీంతో అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను, గుట్టలను, అడవులలో ఉన్నటువంటి చెట్లను నరికి వేస్తూ ఇటుక బట్టీలకు యథేచ్ఛగా తరలిస్తున్నారు.

ఊళ్లలోకి వస్తున్న జంతువులు..

చెట్లను నరికివేయడం, అడవులను ధ్వంసం చేస్తుండటంతో జంతువులు ఆసరా కోల్పోయి ఊళ్లలోకి వస్తున్నాయి. నిత్యం చిరుతలు, ఎలుగుబంట్లు ఊళ్లలో సంచరిస్తున్న విషయాలు పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. ఇక జింకలు, దుప్పిలు, నెమళ్లు మేత కోసం పంటపొలాలవైపు వస్తున్నాయి. అడవులు నాశనం చేయడంతోనే ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆధునిక యంత్రాలను వినియోగించి గుట్టుచప్పుడు కాకుండా చెట్లను నరికి వేస్తూ వాహనాల్లో తరలిస్తున్నారు.

కాసులు కురిపిస్తున్న దందా

వేప, తుమ్మ చెట్లను సైతం అక్రమార్కులు వదలడం లేదు. పంట చేలు, గుట్టల ప్రాంతాలోని చెట్లు, రోడ్డుకు ఇరువైపులా పెరిగిన వృక్షాలు నేలకూలుస్తున్నారు. కలప వ్యాపారులు తక్కువ ధరకు చెట్లను కొనుగోలు చేస్తున్నారు. వాటిని నరికి వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ క్వింటాళ్ల చొప్పున అమ్ముకుంటున్నారు. చెట్ల నరికివేత పై అధికారుల నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడిగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కలపను అధిక ధరలకు విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

దళారులపై చర్యలు తీసుకోవాలి

మొక్కలను పెంచడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయిలు కేటాయిస్తూ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. చెట్లు నరికే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు చెట్ల ఆవశ్యకతను వివరించాలి. చెట్లను నరికివేసిన కారణంగా భవిష్యత్తులో మరిన్ని కరువు కాటకాలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా చెట్లను సంరక్షించాలి.

కలప అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటాం: జిల్లా ఫారెస్ట్‌ అధికారి ప్రశాంత్ రెడ్డి

ప్రతిరోజూ ట్రాక్టర్లు, లారీల ద్వారా కలప తరలుతోందనే విషయం తెలియదు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం కలప నరికివేయకుండా చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేకుండా అక్రమంగా కలప నరకడం, తరలించడం వంటివాటిని అరికడతాం. పట్టుబడిన వారిపై చర్యలు తీసుకుంటాం. సంబంధిత ప్రాంతాలలో నిఘా ఉంచుతాం. ఇటుక బట్టీల్లో దాడులు చేసి చర్యలు చేపడతాం.