TRINETHRAM NEWS

Trinethram News : ఎల్బీనగర్‌: హైదరాబాద్ ఎల్బీనగర్‌లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ఎక్సైజ్‌ సీఐ ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా కోర్టు సమీపంలో రాంగ్ రూట్‌లో వచ్చిన కారు యూటర్న్ చేస్తూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న చార్మినార్‌ ఎక్సైజ్‌ సీఐ సాదిక్‌ అలీ ఘటనా స్థలంలోనే మృతిచెందారు. అదే పీఎస్‌కు చెందిన ఎస్సై ఖాజా వలీ మొయినుద్దీన్‌ గాయపడ్డారు. ఈ ఇద్దరూ మలక్‌పేటలోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. ఎల్బీనగర్‌లో ఓ వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కారు నడుపుతున్న వ్యక్తి అక్కడే వదిలేసి పరారయ్యాడు. సీఐ సాదిక్ అలీకి రెండు రోజుల క్రితం మెదక్‌కు బదిలీ అయినట్టు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.