Trinethram News : కుటుంబంలో ఆడపిల్ల పుడితే లక్ష్మి దేవి పుట్టింది అని పండుగ చేసుకోవలిసిన తల్లిదండ్రులు విచక్షణరహితంగా రోడ్ల మీద వదిలేస్తున్నారు. నేటి ప్రపంచంలో మనుషులు ఎందుకు ఇలా తయారు అవుతున్నారో తెలిదు కానీ ఆనందంతో మనస్సుకు హత్తుకొవలిసిన పసికందులను అనాధలను చేస్తూ, మహిళలిచ్చే జన్మకు విలువ తీసేస్తున్నారు. పిల్లలను దేవుళ్ళుగా భావించే పవిత్ర భారత దేశంలో అనాదిగా వస్తున్న ఆచారంలా పుట్టిన ఆడ పసికందులను తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. ఎంత కిరాతకుడికైనా పసిపిల్లలను చుస్తే జాలి మనిషిలా మారతారు. అలాంటి పుట్టిన పసికందును ఏమాత్రం ఆలోచించకుండా బయట పడేసిన ఘటన అవనిగడ్డలో చోటు చేసుకుంది.
కృష్ణా జిల్లా అవనిగడ్డ ఒకటో వార్డ్ క్రిస్టియన్ చర్చి సమీపంలో అప్పుడే పుట్టిన పసికందును వదిలేసి వెళ్ళిపోయారు. ఈఘటన సోమవారం అర్ధరాత్రి 2గంటల సమయంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు కాల్ చేశారు. ఈలోపు అటుగా వెళ్తున్న పాస్టర్కు చిన్న పిల్ల ఏడుపు పెద్దగా వినిపించింది. ఏమిటా అని చూడగా అప్పుడే పుట్టిన పసికందు కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పాస్టర్ సహాయంతో ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. దయనీయమైన పరిస్థితుల్లో పాపను చూసిన పాస్టర్.. బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని గ్రహించి అవనిగడ్డ ప్రాథమిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు ఆ పాపను పరీక్షించి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని హెచ్చరిచడంతో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనికోసం ప్రత్యేక అంబులెన్సును ఏర్పాటు చేశారు పోలీసులు.