ఇకపై వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యం.. ఈరోజు నుండి కొత్త కార్డులు పంపిణీ
ఆంధ్రప్రదేశ్ వైద్యరంగానికి సంబంధించి సీఎం జగన్ కీలకనిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వరకూ ఉచితవైద్యం అందించే కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుడుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటినుంచి విద్య-వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆసుపత్రుల్లో నాడు-నేడు ద్వారా గతంలో అభివృద్దికి నోచుకోని ఆసుపత్రుల రూపురేఖలు మార్చేసారు. ఒక్క ఆసుపత్రి భవనాలే కాదు.. వైద్యులు, పనిచేసే సిబ్బంది, వారి సమయపాలన ఇలా అన్ని విషయాల్లో కూడా కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించడం, వేలాది రూపాయిలు ఖర్చయ్యే స్కానింగ్‌ల కోసం బయటికి వెళ్లకుండా ఉండేలా అందుబాటులోకి తీసుకొచ్చారు. సుమారు 50 వేల మంది వైద్య సిబ్బందిని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా నియమించారు.
స్పెషలిస్ట్ వైద్యులను అందుబాటులోకి తెచ్చారు. గ్రామాల్లో సైతం రాత్రివేళల్లో కూడా వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మధ్యాహ్న సమయంలో కూడా వైద్యులు అందుబాటులో ఉండేలా మార్పులు తెచ్చారు. దీంతో పేదవాడికి సైతం నాణ్యమైన వైద్యం అందుతుంది. ఇక జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వైద్య సిబ్బంది వెళ్లి ఆయా కుటుంబాల్లోని వారి ఆరోగ్యపరిస్థితి తెలుసుకోవడం, అవసరమైన వారికి ఇంటివద్దనే వైద్య పరీక్షలు చేయడం, ఆసుపత్రిలో చికిత్స అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందించేలా ఏర్పాట్లు చేసారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో జనవరి ఒకటో తేదీ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కూడా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ పథకంలో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం. ఇకపై ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వరకూ ఉచితవైద్యం అందించే కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుడుతున్నారు.
సీఎం జగన్ చేతుల మీదుగా ఆరోగ్య శ్రీ పరిధి విస్తరణ కార్యక్రమం
రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభించనుంది. అంతేకాదు ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకునేందుకు రవాణా ఛార్జీల కింద రూ.300 చెల్లించాలని సీఎం జగన్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. వైయస్సార్ ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అన్నదానిపై ఇప్పటికే ప్రత్యేక వీడియోలను రూపొందించారు అధికారులు. ఈ కార్యక్రమంతో పాటు కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని సుమారు కోటీ 60 లక్షల కుటుంబాల్లో అర్హులైన లబ్దిదారుల కుటుంబాలకు కొత్త కార్డులు జారీ చేయనున్నారు. రేపటి నుంచి ప్రతి నియోజకవర్గంలో 5 గ్రామాల చొప్పున జరిగే కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం జగన్ ఆదేశించారు.