Trinethram News : హైదరాబాద్ : జనవరి 28
పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది.
ఈ ఏడాది 5.07 లక్షల మంది పరీక్ష ఫీజు చెల్లించగా, 2,700 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉన్నతా ధికారులు నిర్ణయించారు. నిరుటి కంటే ఈ ఏడాది 50 అదనపు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
నిరుటి కంటే ఈ ఏడాది 15 వేల మంది అదనంగా పరీక్షలు రాయబోతున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో విద్యార్థుల సంఖ్యను కనిష్టంగా 120, గరిష్ఠంగా 280 మందికే పరిమితం చేయనున్నారు.అంతకు మించి విద్యార్థులు ఉంటే అదే కేంద్రంలో అదనపు వసతులు ఉంటే ఒకే పాఠశాలలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఒక పరీక్ష కేంద్రాన్ని ‘ఏ’ పరీక్ష కేంద్రంగా, మరో దానిని ‘బీ’ కేంద్రంగా వ్యవహరిస్తారు. ఒక్కో కేంద్రంలో ఇద్దరు పోలీసులను బందోబస్తు కోసం వినియోగించాలని, సమస్యాత్మక కేంద్రాల సంఖ్యను ఈసారి పెంచాలని అధికారులు భావిస్తున్నారు.
5 వరకు టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం
పదో తరగతి పరీక్ష ఫీజును ఆలస్య రుసుముతో చెల్లించేందుకు SSC బోర్డు అవకాశం కల్పించింది.
రూ.1000 ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 5లోగా రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.